కేటిదొడ్డిలో వెలవెలబోతున్న ‘ప్రజావాణి’ సంబరం

కలం, జోగులాంబ గద్వాల: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. ప్రతి సోమవారం కేటిదొడ్డి (KT Doddi) ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి దరఖాస్తుదారులు పెద్దగా హాజరు కాకపోవడంతో అధికారులు గంటల తరబడి ఖాళీగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

నాలుగు గంటలపాటు ప్రజల కోసం కేటాయించిన సమయంలో ఫిర్యాదులు అందకపోవడంతో అధికారులు తమ విధులను పక్కనపెట్టి నిరీక్షించాల్సి వస్తోంది. సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రజావాణికి ఎలాంటి ఫిర్యాదు‌లు అందలేదు. అక్టోబర్ 5‌న‌ నిర్వహించిన ప్రజావాణికి ఒకటే ఫిర్యాదు అందింది.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దీనిపై అవగాహన లేకపోవడం, ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల వద్దనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం వంటి కారణాలతో ప్రజావాణికి హాజరు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఫిర్యాదుల మందిరం దరఖాస్తుదారులు లేక వెలవెలబోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాల్సి ఉండగా, ఫిర్యాదుదారులు రాకపోవడంతో సమయం మొత్తం అక్కడే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగాలంటే ప్రజలకు మరింత అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కార ప్రక్రియపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>