కలం, ఖమ్మం బ్యూరో: మద్యం మత్తులో ఏకంగా బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకిన ఒక యువకుడు, ఉధృతికి కొట్టుకుపోయి నది మధ్యలోని ఇసుక దీవిపై ఆగడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. భద్రాచలం – సారపాక (Bhadrachalam) మధ్య గల గోదావరి బ్రిడ్జిపై చోటుచేసుకున్న ఈ నాటకీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గోవిందపురం గ్రామానికి చెందిన జంపన్న (20) అనే యువకుడు బుధవారం రాత్రి మద్యం మత్తులో భద్రాచలం – సారపాక మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. అదృష్టవశాత్తు నీటిలో పడే సమయంలో ఎలాంటి బండరాళ్లు తగలకపోవడంతో అతడికి పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, నీటి ఉధృతికి స్పృహ కోల్పోయిన జంపన్న ప్రవాహంలో కొట్టుకుపోయి, నది మధ్యలో ఉన్న ఒక ఇసుక తిన్నె (దీవి)పైకి చేరి ఆగిపోయాడు.
గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో మెలుకువ వచ్చిన జంపన్న, భయంతో బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. ఆ అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రాచలం టౌన్ సీఐ సట్ల రాజు క్షణాల వ్యవధిలో స్పందించి, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాడు కరుకు ప్రసాద్ సహాయంతో నది మధ్యలో ఉన్న యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
అనంతరం యువకుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అతడు క్షేమంగానే ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, ఆందోళనలో ఉన్న యువకుడు మళ్లీ ఏమైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోననే ముందుజాగ్రత్త చర్యగా అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు రాగానే కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతామని సీఐ సట్ల రాజు వెల్లడించారు. అర్ధరాత్రి వేళ సమయస్ఫూర్తితో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన సీఐ సట్ల రాజును, గజ ఈతగాడు కరుకు ప్రసాద్‌ను పలువురు ప్రశంసించారు.

