కలం, కరీంనగర్ బ్యూరో: హాస్టల్ వసతి (Hostel Facilities), మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు రోజులుగా శాంతియుత నిరసన చేపడుతున్న కొత్తపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల 2, 3, 4వ సంవత్సరం విద్యార్థులు మంగళవారం తమ ఆందోళనను విరమించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) సానుకూల ప్రకటన నేపథ్యంలో బుధవారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతామని మెడికోలు ప్రకటించారు.
మంత్రి స్థాయిలో సమీక్ష.. గడువు విధింపు
విద్యార్థుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా బాలికల హాస్టల్, డిసెంబర్ చివరి నాటికి బాలుర హాస్టల్ నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 2027 నాటికి కళాశాల ప్రధాన భవనాన్ని పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులకు గడువు విధించారు. తాత్కాలిక కళాశాలలోనూ తక్షణమే వసతులు మెరుగుపరచాలని సూచించారు.
అధికారుల భరోసా.. చదువుపై దృష్టి పెట్టాలని సూచన
మంగళవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయూద్దీన్ ఖాన్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. మంత్రులు, జిల్లా కలెక్టర్ కళాశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులను అదనపు కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సీఐ కోటేశ్వర్, తహసీల్దార్ లక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.

