పేద కరాటే క్రీడాకారుడికి గంగుల ఆర్థిక చేయూత

కలం, కరీంనగర్: ప్రతిభ ఉండి ప్రోత్సాహం కరువైన పేద విద్యార్థికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula) అండగా నిలిచారు. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన కరీంనగర్‌కు చెందిన రేవంత్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోటీలకు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలుసుకున్న ఆయన స్పందించారు. పోటీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా శుక్రవారం రేవంత్‌ను తన కరీంనగర్ నివాసానికి పిలిపించుకుని అభినందించి ఆర్థిక సాయం (Financial Support) అందించారు.

కరీంనగర్‌కు చెందిన రేవంత్ కుమార్ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. అయితే రేవంత్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చులు భారంగా మారాయి.

రేవంత్ తండ్రి రమేష్ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ పరిస్థితుల్లో కుమారుడి ప్రతిభను ప్రోత్సహించాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా నిలిచాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంటనే రేవంత్ కుటుంబాన్ని తన నివాసానికి ఆహ్వానించారు. రేవంత్‌తో మాట్లాడి అతడు సాధించిన విజయాలను అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చి ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా రేవంత్‌ను ఉత్సాహపరుస్తూ ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా క్రీడలపై దృష్టి సారించాలని, మరింత కష్టపడి సాధన చేసి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని సూచించారు. పేదరికం కారణంగా ప్రతిభావంతులైన క్రీడాకారులు అవకాశాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో రేవంత్‌కు అండగా నిలిచారు. రేవంత్ సీనియర్ కరాటే మాస్టర్ సురభి వేణుగోపాల్ వద్ద శిక్షణ పొందుతున్నాడు.

రాష్ట్రస్థాయిలో తన ప్రతిభతో జాతీయ పోటీలకు అర్హత సాధించిన రేవంత్‌కు తగిన ప్రోత్సాహం లభించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమ కుమారుడి ప్రతిభను గుర్తించి, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు రేవంత్ తండ్రి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో జాతీయ స్థాయి పోటీలకు దూరమవుతాడేమోనని ఆందోళన చెందిన రేవంత్‌కు గంగుల అందించిన చేయూత కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తగిన ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలోనూ రాణించి కరీంనగర్ జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>