కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో సుమారు 60 సంవత్సరాల అనంతరం నిర్వహించనున్న స్వామివారి నిజరూప దర్శన మహోత్సవానికి ఆదివారం ఘనంగా అంకురార్పణ జరిగింది. స్థానిక శాసనసభ్యులు, డీసీసీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం (Medipally Sathyam) శాస్త్రోక్తంగా అంకురార్పణ పూజలు నిర్వహించి చందనోత్సవ వేడుకలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
నవంబర్ 22 నుంచి భక్తులకు నిజరూప దర్శనాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. దాదాపు ఆరు దశాబ్దాల అనంతరం ఈ మహోత్సవం జరగడం భక్తుల సుకృతమని పేర్కొన్నారు. నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి మూలరాట్టుకు అలంకరించిన చందనాన్ని తొలగించే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అనంతరం నవంబర్ 22 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క భక్తుడు ఈ ఆధ్యాత్మిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కొండగట్టు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు
ఈ మహాక్షేత్ర ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తప్పకుండా హాజరవుతారని హామీ ఇచ్చినట్లు డాక్టర్ మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలోనే ఇలాంటి మహోత్సవం రావడం తన పూర్వజన్మ సుకృతమని, మోకాళ్ల మీద నడిచి దైవ దర్శనం చేసుకుంటున్నానని భావోద్వేగంతో తెలిపారు. తన చివరి ఊపిరి వరకు కొండగట్టు అంజన్న సేవలోనే కొనసాగుతానని, ఉత్సవాలు దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు.
నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి
ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. అంజనా రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 15 నుంచి 20 వరకు మూలరాట్టుకు చందనం తొలగించే కార్యక్రమం ఉంటుందని, ఈ ఐదు రోజులు భక్తులకు పాదధూళి దర్శనం మాత్రమే లభిస్తుందని స్పష్టం చేశారు. దేవస్థానం అధికారులు సూచించే నిబంధనలను భక్తులు తప్పనిసరిగా పాటించి సహకరించాలని కోరారు. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 29 వరకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరించాలని కోరారు.

