కలం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్ తెలంగాణ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుస్మిత పటేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ నాయకత్వం ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి కొండా సురేఖ కనుక బీజేపీలోకి వస్తే పార్టీ తరఫున ఆమెకు స్వాగతం పలుకుతామన్నారు. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనందున పార్టీలో ఎవరినుంచి కూడా ఆమె చేరికపై ఎలాంటి వ్యతిరేకత ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల వేళ ఎంపీ అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

