కలం, వెబ్ డెస్క్: తల్లిదండ్రులకు (Parents) తమ పిల్లలపైన అపారమైన ప్రేమ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎలాంటి షరతులు, స్వార్థం లేని ఏకైక ప్రేమ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా తల్లిదండ్రులదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ప్రేమతోనే వారు తమ పిల్లలు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, అన్ని రంగాలలో రాణించాలని పిల్లలకు నచ్చక పోయినా కొన్ని పనులు చేయమని బలవంతం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలపై అనుకూల ప్రభావం కంటే ప్రతికూల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. అయితే కొన్ని విషయాలలో మాత్రం పిల్లలను అస్సలు బలవంతం చేయకూడదట. అయితే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో (Parenting Tips) ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా తమ పిల్లలు వివిధ అంశాల్లో ప్రావీణ్యం పొందాలన్న ఆశ ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ ఆశతోనే పిల్లల ఇష్టాయిష్టాల్ని లెక్కచేయకుండా.. తమకు నచ్చిందే చేయాలని వాళ్లను ఫోర్స్ చేస్తుంటారు తల్లిదండ్రులు. ఇలాంటి ప్రవర్తన పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే తల్లిదండ్రులు తమకు నచ్చింది కాకుండా పిల్లలకు ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహించాలని, అప్పుడే వారు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఉన్నతి సాధించగలుగుతారని చెబుతున్నారు.
నిరంతరం చదవమని ఒత్తిడి చేయడం
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు నిరంతరం చదువుతూనే ఉంటేనే జీవితంలో విజయం సాధిస్తారని భావిస్తారు. అందుకే పిల్లలను పదే పదే చదవమని ఒత్తిడి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనివల్ల వారికి ఆందోళన పెరిగి చదువుపై ఉన్న ఆసక్తి క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. అందుకే పిల్లలు చదువులో మెరుగ్గా ఉండాలంటే ఒత్తిడి చేయడం మానేసి చక్కటి ప్రణాళిక రూపొందించాలని సూచిస్తున్నారు. చదువుకు, ఆటకు, విశ్రాంతికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఒక పద్ధతి ప్రకారం సమయాన్ని కేటాయించాలని చెబుతున్నారు.
నచ్చని విషయాలు చేయమని ఒత్తిడి చేయడం
పిల్లలకు ఏదైనా ఒక విషయం నచ్చినా, నచ్చకపోయినా వారిని బలవంతం చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఉదాహరణకు.. వారికి నచ్చని ఆటలు ఆడమనడం, సంగీతం లేదా డ్రాయింగ్ నేర్చుకోవాలని బలవంతం చేయడం, లేదంటే పెద్దయ్యాక నువ్వు ఐఏఎస్ కావాలని.. ఇలా తమ ఇష్టాయిష్టాల్ని పిల్లలపై రుద్దేస్తుంటారు. ఇలా బలవంతం చేయడం వల్ల పిల్లలు తమ సహజమైన సృజనాత్మకతను కోల్పోతారని చెబుతున్నారు.
ఒకవేళ వారు ఇష్టం లేని రంగాన్ని ఎంచుకున్నా అందులో దృష్టి పెట్టలేక వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే పిల్లలకు ఏ అంశంపై ఆసక్తి ఉందో తెలుసుకుని, అది మీకు నచ్చకపోయినా ప్రోత్సహించాలని చెబుతున్నారు. అప్పుడే వారు ఆ రంగంలో రాణించి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుందట.
బంధువులు వచ్చినప్పుడు ఈ తప్పులు చేయొద్దు
ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను వారితో సమయం గడపమని చెప్పి, తమ పనుల్లో నిమగ్నం అవుతుంటారు. అంతటితో ఆగకుండా బంధువులకు బలవంతంగా షేక్‌హ్యాండ్ ఇవ్వమని లేదా దగ్గరకు వెళ్లాలని పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. కానీ కొంత మంది పిల్లలు అందరితో త్వరగా కలిసిపోలేరు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలకు ఇష్టం లేనపుడు వారిని బలవంతం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
పిల్లల వ్యక్తిగత సరిహద్దులను గౌరవించడం తల్లిదండ్రుల బాధ్యత. వారిని బలవంతం చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి పిల్లల ఇష్టాలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా బంధువులతో ఉన్నప్పుడు కూడా వారిపై ఓ కన్నేసి ఉంచడం, వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసమని నిపుణులు సూచిస్తున్నారు.

