కలం, జోగులాంబ గద్వాల్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సోమవారం ఆలంపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం రాత్రి హరిత హోటల్లో బస చేసిన ఆయన ఉదయం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మొదట బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మొదట వినాయకుని పూజల్లో పాల్గొని, అనంతరం స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ పరిసరాల్లో కేంద్ర మంత్రి ఇతర అతిధులతో కలిసి మొక్కను నాటారు. అనంతరం జిల్లాకు చెందిన పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నేతలు, పలువురు రైతులు, ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ గౌతమి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దేవాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో పురంధర్, అదనపు కలెక్టర్ మధుమోహన్, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

