కొండా సురేఖ వ్యవహారం.. కీలక పరిణామాల తీరు ఇది..!

కలం, వెబ్​ డెస్క్​ : రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. గల్లిలో మొదలైన వివాదం ఢిల్లీలో ముగిసింది. కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు తల్లి మంత్రి పదవికే ఎసరు పెట్టే పరిస్థితికి తీసుకువచ్చాయి. తెలంగాణతో పాటు కాంగ్రెస్​ లో హాట్​ టాపిక్​ గా మారిన వివాదానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కీల‌క‌ పరిణామాలు చోటుచేసుకున్న తీరు ఇది..

– ఆగ‌స్ట్ 16న సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పరకాలలో జరిగిన బహిరంగ సభలో ఈసారి కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి ప‌ర‌కాల నుంచి పోటీ చేస్తారని, భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

– ఆగ‌స్ట్ 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అదే రోజు కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప‌ర‌కాల‌కు కాబోయే ఎమ్మెల్యే తానే అర్థం వ‌చ్చేలా స్టోరీ పెట్టారు.

– ఆగస్టు 19న కొండా సురేఖ పుట్టిన రోజు సంద‌ర్భంగా నిర్వ‌హించిన వేడుక‌ల్లో కొండా సుస్మిత‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు కళ్లు నెత్తికెక్కాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే రోజు కొండా సురేఖ త‌న కుమార్తె వ్యాఖ్య‌ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. అదే రోజు కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

– ఆగస్టు 20న కొండా సురేఖ క్రమశిక్షణా కమిటీకి తన వివరణ సమర్పించారు.

– ఆగస్టు 21న మంత్రి కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలంటూ అధికార పార్టీకి చెందిన15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించి డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

– ఆగస్టు 22న కరీంనగర్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే రోజు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం కొండా సురేఖ తీరును తప్పుబట్టారు.

– ఆగస్టు 23న మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

– ఆగస్టు 24న సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. అదే రోజు సురేఖ అంశంపై ఎవ్వరూ మాట్లాడొద్దని, పార్టీ అధిష్టానం అన్నీ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి పార్టీ నేత‌ల‌ను ఆదేశించారు.

– ఆగస్టు 26న కొండా సురేఖపై అధిష్టానానికి క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్‌ మల్లు రవి 36 పేజీల నివేదిక అందజేశారు. అదే రోజు కొండా ముర‌ళి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో భేటీ అయ్యారు.

– ఆగస్టు 27న కొండా సురేఖ‌ బెంగళూరు వెళ్లి మ‌ల్లికార్జున ఖ‌ర్గేను క‌లిశారు.

– ఆగస్టు 28న రాఖీ పండుగ సంద‌ర్భంగా మంత్రి కొండా సురేఖ సీత‌క్క‌తో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి బంగారు రాఖీ క‌ట్టారు.

– సెప్టెంబరు 1న ఢిల్లీకి రావాల‌ని ఏఐసీసీ నుంచి మంత్రి కొండా సురేఖకు స‌మాచారం వ‌చ్చింది. దీంతో వెంటనే ఆమె ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. అక్క‌డ‌ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిసే ప్రయత్నం చేసినా ఆయ‌న‌ అపాయింట్‌మెంట్ దొర‌క‌లేదు.

– సెప్టెంబరు 2న‌ ఇందిరాభవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కొండా సురేఖ భేటీ అయ్యారు. త‌న వ్య‌వ‌హారంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను రాతపూర్వకంగా వివరణ అంద‌జేశారు. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్‌తోనూ భేటీ అయ్యారు.

ఈ స‌మావేశం అనంత‌రం కొండా సురేఖ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సీఎం రేవంత్‌, అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>