కలం, కరీంనగర్ : ఒకవైపు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ, భారత్ సమ్మిట్లో రాహుల్ గాంధీ పాల్గొనడంపై నిరసన వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ముకరంపురలోని (Mukarampura) తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ అంశాలపై పరిశోధన, విధానపరమైన చర్చలు జరిపి ప్రపంచంలో జరుగుతున్న అనేక అంశాలపై దృష్టి సారించేందుకు భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
12 సంవత్సరాల క్రితం సంపన్నుల జాబితాలో 600వ స్థానంలో ఉన్న అదానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో రెండో స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు. వ్యాపారానికి, రాజకీయానికి మధ్య ఉన్న గీతను చెరిపేసిన ఘనత బీజేపీదేనని నరేందర్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, బీజేపీ దురాగతాలను ఎండగడుతూ నిర్మాణాత్మకమైన మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనను తట్టుకోలేక బీజేపీ పీటలు కదులుతున్నాయని, అందుకే నిరసనలు వ్యక్తం చేస్తున్నారా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.
సమ్మిట్లో పాల్గొన్న రాహుల్ గాంధీ వివిధ దేశాల ప్రతినిధుల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారని, అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించి దిశానిర్దేశం చేసి ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. అలాంటిది రాహుల్ గాంధీ మధ్యలోనే వెళ్లిపోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నరేందర్ రెడ్డి విమర్శించారు. గతంలో ఎన్నికల్లో గెలవడం కోసం దొంగ ఓట్లను నమోదు చేయించేవారని, ప్రస్తుతం ఎస్ఐఆర్ పేరుతో తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగిస్తున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో దండి రవీందర్, జీడి రమేష్, కుర్ర పోచయ్య, దన్నా సింగ్, మామిడి సత్యనారాయణ రెడ్డి, నాగుల సతీష్, సాయిరాం, భారీ, లక్కిరెడ్డి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

