కలం, సినిమా : ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (Giribabu) (83) అంత్యక్రియలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం, ఆయన స్వగ్రామమైన రావినూతలలో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య కాసేపటి క్రితం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
సొంతూరంటే గిరిబాబుకు ఎంతో మక్కువ ఉండేదని, ఆయన ఆఖరి కోరిక మేరకే రావినూతలలో అంత్యక్రియలు జరిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన పెద్ద కుమారుడు, ప్రముఖ నటుడు రఘుబాబు తీవ్ర భావోద్వేగానికి లోనై ‘నాన్నా..’ అంటూ బోరున విలపించారు. తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన కన్నీరుమున్నీరవ్వడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.
కాగా, అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం గిరిబాబు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 600కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

