కలం, వెబ్ డెస్క్ : దానం నాగేందర్ అనర్హత వేటుపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. దానం నాగేందర్ అనర్హత తీర్పు రాజ్యాంగ విజయమని పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిరాయింపుల రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ఆర్, ఆ తర్వాత కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అయితే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో న్యాయస్థానం వెలువరించిన తీర్పు పట్ల యావత్ తెలంగాణ సమాజం, ప్రజలు అంతటా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఢిల్లీ వేదికగా రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ‘సంవిధాన్ బచావో’ అని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు పచ్చి బూటకమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం దానం నాగేందర్ ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని తెలిసినప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ఏ ప్రాతిపదికన ఎంపీ టికెట్ ఇచ్చిందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు పట్ల రాహుల్ గాంధీ స్పందన ఏమిటో తెలియజేయాలన్నారు. ఢిల్లీ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చే నాటికి ఆయన అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారనే విషయం తెలిసినా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని నిలదీశారు.రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు గానీ, రాహుల్ గాంధీకి గానీ ఉందా? అని ప్రశ్నించారు.
అధికార దుర్వినియోగం, అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అప్పుడు కేటీఆర్ అనేక దుకాణాలు ఓపెన్ చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అనేక దుకాణాలు ఓపెన్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నామని ఆయన ప్రశ్నించారు? విచ్చలవిడిగా అప్పులు చేయడానికా, ఉన్న భూములు అమ్ముకోవడానికా, లిక్కర్ దందా పెంచడానికా, భూములు ఆక్రమించుకోవడానికా, కుటుంబ పాలన తెచ్చుకోవడానికా, ఇచ్చిన హామీలను విస్మరించడానికా? అని నిలదీశారు.

