కలం, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేడు మార్కాపురం జిల్లాలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా నీటికి జల హారతి పైలాన్‌ను ఆవిష్కరించి, ప్రాజెక్ట్ గేట్లను ప్రారంభించారు. అనంతరం నీటిని విడుదల చేశారు. దీనికి ముందు అర్చకులు ప్రాజెక్టు వద్ద సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రాజెక్టుతో ప్రజల మూడు దశాబ్దాల కల నెరవేరింది. నీటి విడుదలతో ఉమ్మడి ప్రకాశం , నెల్లూరు, కడప జిల్లాలు జలకళను సంతరించుకోనున్నాయి. సీఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.
ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. మార్కాపురం గడ్డపై కొత్త చరిత్ర ఆవిష్కృతమైందని సీఎం పేర్కొన్నారు. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల కృష్ణా జలాలతో కళ్ల ముందు నిజయం కాబోతుందన్నారు. 1996లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదని కరువుతో పోరాడిన రైతన్నకు భరోసా అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత కలుగుతుందన్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన యువతకు సొంత గడ్డపైనే భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగు నీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లను, పుట్టి పెరిగిన ఊళ్లన త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం అన్నారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా కూటమి ప్రభుత్వం వెలిగొండ జలసిరులు.. అభివృద్ధికి రెక్కలు.. అనే పేరుతో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తోంది.

