నిరంజన్‌రెడ్డిపై వనపర్తి కాంగ్రెస్ నేతల ఆగ్రహం

కలం, వనపర్తి: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై ఆరోపణలు చేసే ముందు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తన హయాంలో జరిగిన భూ వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ నాయకులు, వెల్టూరు గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు కావని పేర్కొన్నారు. వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెల్టూరు గ్రామ శివారులో ఎమ్మెల్యే మేఘారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్న బీఆర్‌ఎస్‌ ఆరోపణలను గ్రామస్తులు ఖండించారు.

ఆ భూమి కొనుగోలు, విక్రయాల్లో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రఘుపతి రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని, ఏదైనా అక్రమం జరిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని సవాల్‌ చేశారు. అదే సమయంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో వెల్టూరు శివారులోని కుమ్మరి ఇనాం భూమిలో 3 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చూపించి అదనపు భూమిని కబ్జా చేశారంటూ గ్రామస్తులు ఆరోపించారు. గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించి రూ.1.13 కోట్ల వరకు ప్రభుత్వ పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కుమ్మరి నాగన్నకు, మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు మధ్య ఎలాంటి బంధుత్వం ఉందని గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారో ప్రజలకు వివరించాలని సవాల్‌ చేశారు. తమ ఆరోపణల్లో నిజం లేకపోతే ఆధారాలతో ఖండించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా ఆధారాలతో ప్రజల ముందుకు రావాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. లేదంటే తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నేతలు మేఘారెడ్డిపై బురదజల్లే రాజకీయాలు కొనసాగిస్తే తమ హయాంలో జరిగిన భూ వ్యవహారాలను కూడా ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వాల్య నాయక్‌, పెద్దమందడి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, వనపర్తి మండల అధ్యక్షుడు రవికిరణ్‌ యాదవ్‌, పెబ్బేరు మండల కాంగ్రెస్‌ నాయకుడు గంధం రంజిత్‌కుమార్‌, సర్పంచులు రవి నాయక్‌, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మహేష్‌, సురేష్‌ నాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>