కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో (Bhadradri Kothagudem) రహదారి ప్రమాదాలను నివారించి ప్రజలకు రక్షణ కవచంలా నిలవడంతో పాటు, యువత భవిష్యత్తును చిదిమేస్తున్న గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి (DRO Padmavathi) అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఐడీఓసీ (IDOC) కార్యాలయంలోని వీడియో కాన్ఫిరెన్స్ హాలులో ‘జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ’, ‘మాదకద్రవ్యాల నివారణ కమిటీ’ సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల తీవ్రతను అధికారులు సమావేశంలో వివరించారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు పది నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 432 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇందులో 193 ప్రాణాంతక ప్రమాదాలు కాగా, ఏకంగా 206 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది తీవ్రంగా, 397 మంది స్వల్పంగా గాయపడ్డారు. నమోదైన ప్రమాదాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ గణాంకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డీఆర్వో, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్’లను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాదకర మలుపులు, కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్‌లు, రిఫ్లెక్టర్లు, వీధి దీపాలను ఏమాత్రం జాప్యం లేకుండా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా విస్తృత అవగాహన కల్పించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీస్, రవాణా శాఖలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం జరిగిన మాదకద్రవ్యాల నివారణ కమిటీ సమావేశంలో డీఆర్వో మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 89 కేసులు నమోదు చేసి, రూ. 11,25,94,500 విలువైన 2,200.89 కేజీల గంజాయిని సీజ్ చేశామని వివరించారు. ఈ కేసుల్లో మొత్తం 274 మంది నిందితులను అరెస్టు చేశామని, మత్తుకు బానిసలైన 109 మందిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. మాదకద్రవ్యాల వినియోగంతో వ్యక్తుల జీవితాలు దుర్భరమవుతాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత, కార్మికులు వీటి బారిన పడకుండా విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీహెచ్ వెంకటేశ్వర్లు, వైద్య శాఖ అధికారి డాక్టర్ వీరబాబు, ఆరోగ్యశ్రీ ప్రతినిధి మహేష్, డీఆర్ఎం బాలాజీ, పోలీస్ అధికారులు కరుణాకర్, విజయలక్ష్మి, రవాణా శాఖ ఏఎంవీఐ శ్వేత, ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ కుమార్, ఆర్టీసీ ప్రతినిధి మోహన్ రావు, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.

