సోనియాపై కేటీఆర్ వ్యాఖ్య‌లు.. చామ‌ల కౌంట‌ర్‌

‎కలం, భువనగిరి : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పాత్రను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి 32 మందికి పైగా ఎంపీలు ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఎంపీ చామల గుర్తు చేశారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని పక్కన పెట్టి కేసీఆర్ ఆ పదవిని చేపట్టారని, అమెరికా ఉద్యోగం వదిలి వచ్చిన కేటీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఒకే కుటుంబంలో ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీ పదవులు దక్కాయని ఎంపీ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎంపీ చామల విమర్శించారు.

సుమారు రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేయడం వల్ల, ప్రస్తుతం రాష్ట్రంపై నెలకు రూ. 8 వేల కోట్ల మేర వడ్డీ భారం పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో పేదలకు సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎంపీ వివరించారు. ‘మహిళా శక్తి’ పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే, కేటీఆర్ వాటిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా పథకాన్ని ప్రభుత్వం అందిస్తోందని, నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడించారు.

ఈ పథకాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా స్వాగతించాలని, అవసరమైతే కేటీఆర్ కుటుంబ సభ్యులు సైతం దీనిని వినియోగించుకోవచ్చని అన్నారు. ‎అలాగే, చేర్యాలలో జరిగిన పెన్షన్ ప్రొసీడింగ్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజకీయ రసాభాస చేసేందుకు ప్రయత్నించారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రెస్‌మీట్లు, ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అడ్డుకోవడం బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>