కలం, జగిత్యాల: జగిత్యాల వ్యవసాయ మార్కెట్ (Jagtial Agricultural Market) యార్డును చెల్గల్లోని మార్కెట్ యార్డుకు తరలించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం నుంచి ధాన్యం క్రయవిక్రయాలన్నీ చెల్గల్ మార్కెట్ యార్డులోనే నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుత వానాకాల సీజన్లో ధాన్యం దిగుబడులు అధికంగా రావడంతో జగిత్యాల మార్కెట్ యార్డులో స్థలాభావం ఏర్పడిందని పేర్కొన్నారు. ధాన్యం ఎగుమతులు, దిగుమతులకు ప్రస్తుత మార్కెట్ స్థలం సరిపోక రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు.
ఈ నేపథ్యంలో 30 ఎకరాల విశాలమైన స్థలంలో అన్ని సౌకర్యాలు కలిగిన చెల్గల్ మార్కెట్ యార్డుకు మార్కెట్‌ను తరలించినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ మార్కెట్ క్రయవిక్రయాలు సజావుగా జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వివరించారు. కావున జగిత్యాల పరిసర ప్రాంతాల రైతులందరూ తమ ధాన్యం ఉత్పత్తులను చెల్గల్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి విక్రయించుకోవాలని చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి కోరారు. మార్కెట్ తరలింపు విషయంలో రైతులు మార్కెట్ కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

