కలం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతడిని పక్కనపెట్టడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) వ్యంగ్యంగా స్పందించగా.. మహమ్మద్ కైఫ్ టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సిరాజ్‌కు చోటు ఇవ్వకపోవడంపై అశ్విన్ సోషల్ మీడియా వేదికగా రెండు పోస్టులు పెట్టాడు. ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని చెబుతూనే.. సిరాజ్ బౌలింగ్ లయ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాటికి తిరిగి ఫామ్‌లోకి రావాలని అశ్విన్ (Ashwin) సూచించాడు. మరో పోస్టులో 60-80 ఓవర్ల మధ్య బ్యాటింగ్ సులభంగా ఉంటుందని చెబుతూ, ఆ సమయంలో సిరాజ్ బౌలింగ్ చేసి వికెట్లు తీయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు కైఫ్ మాత్రం సిరాజ్‌ను మళ్లీ పక్కనపెట్టడం నమ్మశక్యంగా లేదన్నాడు. విదేశీ టెస్టుల్లో బుమ్రాతో పాటు సిరాజ్‌ను కూడా ప్రధాన బౌలర్‌గా పరిగణించాలని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సైతం సిరాజ్‌ను ప్రపంచ స్థాయి బౌలర్‌గా పేర్కొన్నారని గుర్తుచేశాడు.
అతడు బాగా బౌలింగ్ చేస్తున్నాడని కోచ్ చెప్పినప్పుడు, జట్టులో ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించాడు. ఇక క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదు వికెట్లకు 246 పరుగులు చేసింది. ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ వికెట్లు తీసి భారత్‌కు ఊరటనిచ్చారు. బుమ్రాకు మాత్రం వికెట్ దక్కలేదు.

