కలం, ఖమ్మం బ్యూరో: ఆపదలో ఉన్నవారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అభయహస్తంగా నిలుస్తుందని ఖమ్మం టూ టౌన్ పోలీసులు (Khammam Police) మరోసారి చాటిచెప్పారు. అత్యవసర నంబర్ డయల్-112కు (Dial 112 Emergency Call) అందిన ఒక్క కాల్తో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు, తప్పిపోయిన ఓ మహిళను (Missing Woman) వేగంగా గుర్తించి క్షేమంగా ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ తప్పిపోయినట్లు గత రాత్రి డయల్-112కు అత్యవసర ఫిర్యాదు అందింది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఖమ్మం టూ టౌన్ పోలీస్ సిబ్బంది, బ్లూకోల్ట్స్ (Blue Colts) బృందం అప్రమత్తమై నగరంలోని పలు కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఖమ్మం న్యూ బస్స్టాండ్ పరిసరాల్లో సదరు మహిళను పోలీసులు గుర్తించారు. ఆమెకు ధైర్యం చెప్పి భరోసా కల్పించిన పోలీసులు, అనంతరం కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి క్షేమంగా వారికి అప్పగించారు.
ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు, ఆపదలు ఎదురైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. సకాలంలో స్పందించి మహిళను క్షేమంగా కాపాడిన టూ టౌన్ సిబ్బందిని, బ్లూకోల్ట్స్ బృందాన్ని సీఐ ప్రత్యేకంగా అభినందించారు. తమ వారిని సురక్షితంగా అప్పగించినందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

