కలం, ఖమ్మం బ్యూరో: యువతను, విద్యార్థులను పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాలపై ఖమ్మం (Khammam) ఖానాపురం హవేలి పోలీసులు ఉక్కుపాదం మోపారు. మత్తు పదార్థాల విక్రయాలు, వాడకాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఠాణా పరిధిలోని పాఠశాలలు, సమీప ప్రాంతాలలో శనివారం భారీ స్పెషల్ డ్రైవ్ (Anti-Drug Drive) నిర్వహించారు. ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ నేతృత్వంలో పాండురంగపురం, బల్లెపల్లి గ్రామాల్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందికి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సురక్షితమైన, డ్రగ్స్ రహిత వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాథమిక బాధ్యతని స్పష్టం చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆరోగ్యం, ఆర్థిక స్థితితో పాటు భవిష్యత్ జీవితం పూర్తిగా నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని, సమాజంలో డ్రగ్స్ పట్ల అప్రమత్తత పెంపొందించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ స్పెషల్ డ్రైవ్(Anti Drug Drive)లో భాగంగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో పాఠశాల ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలతో పాటు సమీపంలోని షాపులు, అనుమానాస్పద ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. చట్టవిరుద్ధంగా మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయేమో గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహించామని, ఎవరైనా మత్తు పదార్థాలను నిల్వ ఉంచినా లేదా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read : ‘సర్’పై ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Follow Us On: X(Twitter)

