కలం, ఖమ్మం బ్యూరో : ఫిబ్రవరి 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 9 తేదీ నుండి 13 వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించే వరకు ఖమ్మం (Khammam) పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 BNSS యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదన్నారు. అదేవిధంగా ఎవరూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడటం చేయరాదని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, అతిక్రమించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎక్కడైనా డబ్బు, మద్యం ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయకూడదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, ఫారెస్ట్ కేంద్ర బలగాలు హోంగార్డులు, SPO లకు నిషేధ అంక్షాలు నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మునిసిపాలిటీ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ.. పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
పోలింగ్ సందర్భంగా ఓటర్లకు భద్రత రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైనా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరం వరకు ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ (Khammam Police Commissionerate) పరిధిలో ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధమన్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం, చట్టబద్ధమైన అధికారానికి భంగం కలిగించే లేదా ధిక్కరించే నేరానికి దారితీసే అవకాశం ఉన్న ఏదైనా ప్రసంగం నిషేధం అని కమిషనర్ స్పష్టం చేశారు.
Read Also: కేసీఆర్ చరిత్ర అంతా అక్రమాలే.. దాన్ని నేను చెరపను : సీఎం రేవంత్
Follow Us On: Instagram


