వేంసూరులో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

​కలం, ఖమ్మం బ్యూరో: రూ.1 లక్ష అసలైన కరెన్సీ ఇస్తే.. రూ.2.10 లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామన్నారు. ఈజీ మనీకి ఆశపడ్డ నిందితులు ఆ దొంగ నోట్లను ఒరిజినల్ నోట్లతో కలిపి మార్చేందుకు పక్కా స్కెచ్ వేశారు. కట్ చేస్తే, ఒక చిన్న పొరపాటుతో కథ అడ్డం తిరిగి ముఠా మొత్తం పోలీసులకు చిక్కి జైలుపాలైంది. కేవలం రూ.18 వేల ఫోన్‌పే మోసంతో మొదలైన విచారణ, చివరికి పెద్ద అంతరాష్ట్ర నకిలీ నోట్ల (Fake Currency) గుట్టును రట్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను వేంసూరు పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 59 నకిలీ రూ.500 నోట్లు, 7 మొబైల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

​కందుకూరు గ్రామానికి చెందిన కొప్పుల నాగిరెడ్డి అనే కిరాణా వ్యాపారి వద్దకు వచ్చిన నిందితులు రూ.18,000 నగదు ఇచ్చి, ఆ మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత సదరు వ్యాపారి ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా, అందులో 18 నకిలీ రూ.500 నోట్లు ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించి షాక్ ఇచ్చారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వేంసూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కవిత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ​దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిన ఈ నకిలీ నోట్ల చలామణిపై ఖమ్మం సిపి సునీల్ దత్, సత్తుపల్లి ఏసీపీ వసుంధర యాదవ్ తీవ్రంగా స్పందించారు. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సత్తుపల్లి సీఐ ఎం.ఎల్. ముత్తిలింగయ్య సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

​పోలీసుల విచారణలో పలు ఆసక్తికర, దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మారం రమేష్, అతని సోదరుడు మారం మహేష్, సార్నాలా రవీంద్రలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో దాసరి ప్రమోద్, మిరియాల చెందుల ద్వారా చింతలపూడికి చెందిన దొంగనోట్ల వ్యాపారి జుజ్జవరపు రవిని సంప్రదించారు. రవి వద్ద రూ.1 లక్ష అసలైన నోట్లు ఇచ్చి, రూ.2.10 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను తీసుకున్నారు. ఆపై సత్తుపల్లి, వేంసూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వీటిని అసలు నోట్లతో కలిపి చలామణి చేయడం మొదలుపెట్టారు.

​ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు పాత నేరస్థులేనని దర్యాప్తులో తేలింది. కాకినాడలో వైద్యుడిగా చలామణి అవుతూ రెండు ఆసుపత్రులు నిర్వహిస్తున్న కొవ్వూరి వినోద్ సతీష్ కుమార్ రెడ్డి గతంలో సైబరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు దొంగ నోట్ల కేసులోనే దొరికి జైలుకు వెళ్లాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా బయటకు వచ్చాక రూ.50 వేల ఒరిజినల్ కరెన్సీకి రూ.2.10 లక్షల నకిలీ నోట్లను సరఫరా చేశాడు. ఇక మరో నిందితుడు జుజ్జవరపు రవి కూడా గతంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పీఎస్ పరిధిలో నకిలీ కరెన్సీ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై తిరుగుతున్నాడు. పక్కా ఆధారాలతో చిక్కిన నిందితులందరినీ అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచామని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>