కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గౌరవ ప్రతిష్టలకు సంబంధించినవని, ఉమ్మడి జిల్లాలు పార్టీకి కంచుకోట అయినంత మాత్రాన గెలుస్తామనే ధీమాతో నాయకులు, కార్యకర్తలు ఎవరూ అలసత్వం వహించవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) హెచ్చరించారు.
శనివారం ఖమ్మంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి గెలుపు కోసమై ఏర్పాటు చేసిన పార్టీ సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అరుదైన గౌరవం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిర్ణయించే పూర్తి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం దశాబ్దాలుగా ఎంతో కష్టపడి పనిచేసిన దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి అరుదైన గౌరవం కల్పిస్తూ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి టికెట్ కేటాయించడం ఎంతో సంతోషకరమన్నారు. దామోదర్ రెడ్డి మరణించిన సమయంలో ‘ఈ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కట్టుబడి, దానికి అనుగుణంగానే సర్వోత్తమ్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలిపారు.
ఈ ఎన్నిక కేవలం ఒక ఎమ్మెల్సీ స్థానానికే పరిమితం కాదని, ఏకంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిపై ప్రభావం చూపే అత్యంత కీలకమైన ఘట్టమని తుమ్మల స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించిన ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కరూ నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో సమన్వయంతో శ్రమించాలని కోరారు. ముఖ్యంగా గతంలో ఓటు హక్కు నమోదు చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్లీ ఎందుకు చేసుకోవాలనే అలసత్వానికి తావివ్వకుండా, అర్హులైన కొత్త గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ నమోదు చేయించే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో తెలంగాణలో అత్యుత్తమ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టభద్రులు ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. మనపై రాజకీయంగా కక్ష కట్టిన ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, శ్రేణులంతా ఐక్యంగా పోరాడి కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.

