ఖమ్మం కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు..!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ (Khammam Congress) పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో, క్లీన్ స్వీప్ విజయంతో తిరుగులేని కంచుకోటగా నిలిచిన పార్టీలో, ఇప్పుడు నామినేటెడ్ పదవుల పంపకం పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ కోసం చెమటోడ్చిన కార్యకర్తలు, రక్తం చిందించిన సామాన్య నేతలు ఇప్పుడు హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​జిల్లాలో సామాజిక సమతుల్యత గాలికొదిలేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో పదవుల పంపకాలు గమనిస్తే, ఒక్క సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని బలహీన వర్గాలు ఆరోపిస్తున్నాయి. అత్యంత కీలకమైన సుడా (SUDA) చైర్మన్, నగర మేయర్ పదవి, అర్బన్ డీసీసీ అధ్యక్ష పదవి.. ఇలా అన్నీ ఒకే ఖాతాలోకి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ​”గెలిపించడానికి మా ఓట్లు కావాలి కానీ, పదవుల దగ్గరికి వచ్చేసరికి మా ముఖాలు కనిపించవా?” అంటూ సామాన్య కార్యకర్తలు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

​జిల్లా జనాభాలో సింహభాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందనే భావన వ్యక్తమవుతోంది. జిల్లాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మున్నూరు కాపులకు ఒక్క పదవి కూడా దక్కకపోవడం ఆ సామాజిక వర్గ నేతలను ఆగ్రహానికి గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో తమకు దక్కిన గౌరవం, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​ముదిరాజ్, రెడ్డి, మాదిగ సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పించకుండా కేవలం వ్యక్తుల చుట్టూ తిరిగే వారికే పదవులు కట్టబెట్టారని విమర్శలు వస్తున్నాయి.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన సీనియర్లను కాదని, పారాచూట్ నాయకులకు లేదా పైస్థాయి సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాల వల్ల అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఖమ్మం జిల్లా నుంచి మొత్తం ముగ్గురు మంత్రులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఒక మంత్రి అనుచరులకు మాత్రమే గుర్తింపు దక్కిందనే ఆరోపణలు కూడా స్థానిక నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే పార్టీ ఆదేశాలకు తల వంచి ఎవ్వరు బహిరంగ విమర్శలు చేయడం లేదు. కాగా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మాత్రం బహిరంగంగానే తమ వర్గీయులకు పదవులు లభించలేదని విమర్శలు చేస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగానే హైద్రాబాద్ లో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి, విధి విధానాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత సీనియర్ నాయకురాలైన తన వర్గీయులకు నామినేటెడ్ పోస్టులలో స్థానం దక్కక పోవడం పై ఆమె తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరో పక్క పదవులు దక్కని నేతలందరూ, ఇప్పుడు మమ్మల్ని విస్మరిస్తే, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం అని అల్టిమేటం జారీ చేస్తున్నట్లు వినికిడి. మొత్తానికి ​ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో రేగిన ఈ అసంతృప్తి జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా లేవు. అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని, సామాజిక సమీకరణాలను సరిచేయకపోతే, కంచుకోటలాంటి జిల్లాలో పార్టీ పునాదులు కదిలే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>