కలం, వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ( నాని) (Kesineni Nani ) టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని.. ఇసుక రేషన్, సెటిల్మెంట్లతో విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు చిన్ని చీకటి సామ్రాజ్యం.. భయం నీడలో బెజవాడ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
చిన్ని తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రజలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు. కేవలం రాజకీయాలే కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో నిధుల దుర్వినియోగం వంటి విషయాలపై కూడా చిన్నిపై ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. అంతేకాదు వాణిజ్య సముదాయాలు, ఆస్తి విభాగాలలో సైతం చిన్ని జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
మరోవైపు రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని తెలిపారు. తన అధికార బలంతో తప్పుడు కేసులతో తన స్నేహితులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కేశినేని నాని కోరారు. లేదంటే బెజవాడలో వ్యవస్థలు మరింత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. బెజవాడలో ప్రస్తుతం కేశినేని బ్రదర్స్ పోరు హాట్ టాపిక్ గా మారింది.

