జ్ఞానేష్‌ కుమార్‌కు భారీ షాక్.. విచారణకు ఆదేశం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్‌ (Gyanesh Kumar)కు కేరళ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆయనపై 20 ఏళ్ల కిందట నమోదైన కేసుపై మళ్లీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విజిలెన్స్ శాఖకు హోం మంత్రి రమేశ్ చెన్నితాల ఆదేశాలు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియపై అభ్యంతరాలు వెల్లువెత్తుతుండటం, జ్ఞానేష్‌ కుమార్‌ తీరుపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమమే చేస్తున్న నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం పాత కేసును తిరగదోడటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. జ్ఞానేష్‌ కుమార్‌పై ఆరోపణలు నిజమైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది.

అసలు కేసు ఏంటీ..?

జ్ఞానేష్‌ కుమార్‌ 1988 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. కేరళలో పనిచేసిన అనంతరం కేంద్ర సర్వీసుల్లోకి వచ్చి సుదీర్ఘ కాలం ఇక్కడే పనిచేసి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ స్థాయికి ఎదిగారు. జ్ఞానేష్‌ కుమార్‌ 2006లో కేరళ ప్రభుత్వంలో ప్రజా పన్నుల శాఖలో కార్యదర్శిగా పనిచేస్తుండేవారు. రాష్ట్రంలో రహదారి నిర్మాణాలు చేపట్టేందుకు ఇండో-మలేషియా సంస్థ అయిన ప్యాటీ-బెల్‌ కన్సార్షియం కాంట్రాక్టు పొందింది. పనులు చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున లంచాలు ఇవ్వాలని తనను వేధించారని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ లీ సీ బీన్ పలుమార్లు ఆరోపించారు. అదే సంవత్సరం నవంబరులో కొందరు అధికారుల పేర్లు రాసి మలేషియాలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ లేఖలో శాఖ కార్యదర్శి జ్ఞానేష్‌ కుమార్‌ పేరును కూడా ప్రధానంగా రాశారు.

విచారణకు ఆదేశించినా..

అధికారుల లంచాల వేధింపులు తట్టుకోలేక ప్రాజెక్ట్ చీఫ్​ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. స్పందించిన అప్పటి సీఎం వీఎస్ అచ్యుతానందన్ జ్ఞానేష్‌ కుమార్‌ను కార్యదర్శి పోస్ట్ నుంచి తప్పించి, విచారణకు ఆదేశించారు. జ్ఞానేష్‌ కుమార్‌పై కేసు కూడా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై కాగ్ సైతం సుమారు రూ.92 కోట్ల అక్రమాలు జరిగినట్లు నిర్ధారించింది. జ్ఞానేష్‌ కుమార్‌ తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడంతో ఈ కేసు విచారణ పూర్తిగా మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.

చర్యలు కష్టమేనా..?

జ్ఞానేష్‌ కుమార్‌పై విచారణ జరిగినా ఆయనపై చర్యలు తీసుకోవడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కారణం ఆయన కేంద్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ కావడమే. 2023లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు సివిల్, క్రిమినల్ కేసుల నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. పదవి విరమణ తరువాత కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి చట్టం అనుమతించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>