కలం, వెబ్ డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) విషాదం చోటుచేసుకుంది. కీసర–శామీర్పేట మార్గంలో కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం ప్రమాదానికి (ORR Accident) గురైంది. వేగంగా వెళ్తున్న క్రమంలో వాహనం వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న కూలీలు మంగీలాల్ (60), సురేఖ (40) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదే వాహనంలో ఉన్న మరో 11 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన తోటి వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 11 మంది క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

