epaper
Monday, February 2, 2026
spot_img
epaper

ప్రొటెస్ట్ సక్సెస్ కాలేదెందుకు?.. బీఆర్ఎస్ నేతల్లో చర్చ

కలం, తెలంగాణ బ్యూరో : కేసీఆర్‌ను (KCR) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ (SIT) పోలీసులు విచారణకు పిలిపించడానికి నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు (BRS Protests) చేపట్టారు. భారీ స్థాయిలో జరుగుతాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అంచనా వేసుకున్నారు. పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేయలేనంత స్థాయిలో జరుగుతుందని ఊహించుకున్నారు. బలప్రదర్శనగా మారుతుందని లెక్కలేసుకున్నారు. కానీ హైదరాబాద్‌లోగానీ, జిల్లాల్లోగానీ ఆ స్థాయిలో జరగకపోవడం ఆ పార్టీలోని చాలామంది స్టేట్ లీడర్లను విస్మయానికి గురిచేసింది. పార్టీ శ్రేణులు తక్కువ సంఖ్యలోనే కదలడం, ప్రజలు స్వచ్ఛందంగా రాకపోవడం కొన్ని సందేహాలను లేవనెత్తింది. రాష్ట్రాన్ని సాధించడానికి చావు నోట్లో తలపెట్టి కొట్లాడిన నేతను పోలీసులు రాజకీయ ప్రతీకార చర్యలతోనే ఫోన్ ట్యాపింగ్ కేసుతో ముడిపెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేసింది. అయినా ప్రజలు రాకపోవడం ఇప్పుడు వారిని గందరగోళంలో పడేసింది.

సెంటిమెంట్ ప్రయోగించినా ఫలితం లేదా? :

ఒకప్పుడు ఇదే నందినగర్ నివాసంలోని సెకండ్ ఫ్లోర్‌లో రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని నడిపించడంపై రాజకీయ వ్యూహం కోసం నిద్రలేని రాత్రులు గడిపానని, వందలాది మందితో ఇదే రూమ్‌లో చర్చలు జరిపానని కేసీఆర్ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ గదిలో ఇప్పుడు పోలీసు అధికారులు తనను విచారించే సందర్భం వస్తుందని కలలూ కూడా ఊహించలేదని లంచ్ తర్వాత కేసీఆర్ ఒకింత భావోద్వేగానికి గురైనట్లు బీఆర్ఎస్ నాయకులు ఉదహరించారు. ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరులూదిన ఈ గదిలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగడం ఒక చేదు పరిణామమనే మెసేజ్‌ను పార్టీ నేతలు పంపినా రాష్ట్రంలో ఆశించినంతగా ప్రజలు, కేడర్ నుంచి స్పందన లేదనే నిరుత్సాహం కొద్దిమంది అగ్రనేతల్లో కనిపించింది. దీన్నే తెలంగాణ భవన్‌లో ఉన్న పలువురితో ఆ అగ్రనేతలు మాట్లాడి భవన్ దగ్గరి తాజా పరిస్థితిపై ఆరా తీశారు.

ప్రజల్లో కనిపించని పాజిటివ్ రెస్పాన్స్ :

రాష్ట్రం కోసం కేసీఆర్ కొట్లాడిన అంశాన్నిగానీ, ఉద్యమనేతగా ఆయనను గుర్తించడంలోగానీ, ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన కృతజ్ఞతగానీ ప్రజలు మర్చిపోకపోయినా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం రెండేండ్ల క్రితం వెలుగులోకి వచ్చిన అంశం వారిలో వేర్వేరు అభిప్రాయాలు కలగడానికి దారితీసింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేననే భావనకు నెట్టింది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితే స్వయంగా తన భర్త ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని నిందించడాన్ని కొందరు ప్రజల నోట వినిపించింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అప్పటి ప్రతిపక్ష లీడర్ల, ఉప ఎన్నికల సందర్భంగా ఆపొజిషన్ పార్టీ కదలికలను కేసీఆర్ తెలుసుకుని పోలీసుల ద్వారా బ్రేక్ వేయించారన్న ఆరోపణలు బీఆర్ఎస్ హయాంలోనే వినిపించాయి. వీటన్నింటినీ ప్రజలు గుర్తుచేసుకుని కేసీఆర్ మంచోడే.. చాలా స్కీమ్‌లు తెచ్చారు.. కానీ ఫోన్ ట్యాపింగ్ మంచిది కాదు గదా… అనే తీరులో కామెంట్ చేశారు.

‘సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు :

నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ను సిట్ పోలీసులు నాలుగున్నర గంటలకు పైగా విచారించిన తర్వాత అక్కడ పార్టీ శ్రేణుల నుంచి ‘సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు (BRS Protests) మారుమోగాయి. విచారణ కోసం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి కారులో వస్తున్నప్పుడు కూడా దారి వెంట కొందరు ఆసక్తిగా ఎదురుచూశారు. పార్టీ కేడర్ కార్లు, బైక్‌లతో ఆయన వెంట హైదరాబాద్ దాకా వచ్చారు. విచారణ ప్రారంభం కావడానికి ముందు నివాసం దగ్గరకు రావడానికి ప్రయత్నించారు. కానీ పోలీసుల ఆంక్షలతో విచారణ పూర్తయిన తర్వాత చేరుకున్నారు. ఆ తర్వాత స్వయంగా కేసీఆర్ బైటకొచ్చి కేడర్‌కు, అభిమానులకు అభివాదం చేశారు. ఆ సమయంలో ‘సీఎం కేసీఆర్..’ అంటూ నినాదాలతో స్పందించారు.

Read Also: కేసీఆర్ ఎంక్వయిరీకి ఆ వాంగ్మూలమే కీలకం..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>