రాష్ట్రస్థాయి పోటీల్లో ఇంటర్ సర్కిల్ కరీంనగర్ క్రీడాకారుల సత్తా

కలం, ​కరీంనగర్ బ్యూరో: రాష్ట్రస్థాయి ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీల్లో కరీంనగర్ (Karimnagar) జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి తమ ఆధిక్యతను చాటుకుంది. నిజామాబాద్‌లో ఈ నెల 17 నుండి 19 వరకు నిర్వహించిన టీజీ ట్రాన్స్ కో/ డిస్కమ్ రాష్ట్రస్థాయి ఇంటర్ సర్కిల్ బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ పోటీలలో కరీంనగర్ జట్టు ఘన విజయాలను సాధించింది.

​బాస్కెట్‌బాల్ ఫైనల్‌లో ఘన విజయం:

ఉత్కంఠభరితంగా జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్ సమరంలో కరీంనగర్ జట్టు 45–20 స్కోరు తేడాతో ఖమ్మం జట్టుపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. జట్టు కెప్టెన్ రాజు అద్భుతమైన నాయకత్వ పటిమ, సమన్వయంతో కీలక సమయాల్లో రాణించి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇదే టోర్నమెంట్‌లో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ విభాగంలోనూ కరీంనగర్ జట్టు 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

​15 ఏళ్లుగా కొనసాగుతున్న విజయ పరంపర

ఈ సందర్భంగా జట్టు మేనేజర్, సీనియర్ ప్లేయర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గత 15 సంవత్సరాలుగా కరీంనగర్ బాస్కెట్‌బాల్ జట్టు విజయ పరంపర నిరంతరాయంగా కొనసాగడం ఎంతో గర్వకారణమని తెలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, సమిష్టి కృషి, పట్టుదలే ఈ విజయానికి మూల స్తంభాలని పేర్కొన్నారు. ​ఈ విజయంలో భాగస్వాములైన జట్టు సభ్యులు విశ్వతేజ, వినీత్, మేఘనాథ్, రమేష్, సుధీర్ కుమార్, రంగు వెంకటనారాయణ, వినీల్, ప్రశాంత్, మోయిన్ పాషాలను పలువురు అభినందించారు.

​అధికారులు, క్రీడాభిమానుల ప్రశంసలు..

విజేతలుగా నిలిచిన కరీంనగర్ (Karimnagar) బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ జట్లను కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఈ జట్లు మరింతగా రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని ట్రోఫీలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>