కలం, కరీంనగర్: సీపీజీఈటీ (CPGET) ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థుల సౌకర్యార్థం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ (Karimnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక SRR డిగ్రీ & పీజీ కళాశాలలో శనివారం హెల్ప్ డెస్క్ (Help Desk) ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా SFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. మారుమూల, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ, కౌన్సెలింగ్ విధానం, వెబ్ ఆప్షన్లు, సీటు అలాట్‌మెంట్‌పై సరైన అవగాహన ఉండకపోవచ్చని, అలాంటి వారికి పూర్తి స్థాయిలో మార్గదర్శకత్వం చేసేందుకు ఈ హెల్ప్ డెస్క్ ఉపయోగపడుతుందని తెలిపారు. అడ్మిషన్ల సమయంలో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు, ముఖ్యమైన తేదీలను విద్యార్థులకు గుర్తుచేస్తూ ప్రవేశాల ప్రక్రియ సజావుగా సాగేలా సహకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఉన్నత విద్య ప్రతి విద్యార్థికీ అందుబాటులోకి రావాలని, ప్రభుత్వ పీజీ కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు సీట్ల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. CPGET ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ హెల్ప్ డెస్క్ కొనసాగుతుందని, విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ సందేహాల నివృత్తికి SFI హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని కోరారు. SFI ఎల్లప్పుడూ విద్యార్థుల హక్కుల పోరాటంతో పాటు వారికి భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శులు బోగేష్, ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, సన్నీ, కృప, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

