కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయి బలోపేతం దిశగా పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ ను రూపొందించనున్నారు. త్వరలో యాప్ తుది రూపం దాల్చనుంది.
శిక్షణ అనంతరం వీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా శిక్షణ శిభిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గంలో ఉన్న బూత్ ల సంఖ్యను బట్టి బూత్ కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు జరుగనున్నాయి. ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన తర్వాత సభ్యత్వ నమోదు తేదీ ప్రకటన ఉంటుంది.
ఆరోజునే స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ తో సహా పార్టీ నేతలంతా సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్దరణతో పాటు నమోదు ప్రక్రియ మొదలవుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తారు. ప్రకటించబడిన తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ శిక్షణాశిబిరాలు నిర్వహించడం జరుగుతుంది.

