జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర మెగా ఫ్లైఓవర్ ప్రాజెక్ట్!

కలం, తెలంగాణ బ్యూరో: కేబీఆర్ పార్క్ (KBR Park) పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం మరో ప్రణాళిక రూపొందించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్టలోని ముఫకంజా కాలేజీ సుమారు 4.3 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల స్టీల్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.1,090 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా శుక్రవారం పరిశీలించారు.

గతంలో కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, ఇతర గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. అయితే పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమలుతో ఏర్పడిన పరిస్థితులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో గత ప్రతిపాదనలను పునఃసమీక్షించారు. వన్‌వే విధానాన్ని కొనసాగిస్తూనే ట్రాఫిక్ సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపేలా కొత్త ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు వివరించారు. అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్లు నిర్మించడానికి బదులుగా ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదించారు.

రెండు ప్యాకేజీల్లో పనులు

ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) విధానంలో రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.580 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండో ప్యాకేజీలో ముగ్ధా జంక్షన్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు ఫ్లైఓవర్ నిర్మించడంతో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్‌–1కు ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంపును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్యాకేజీకి రూ.510 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండు ప్యాకేజీలకు కలిపి మొత్తం రూ.1,090 కోట్లుగా లెక్కగట్టారు.

రూ.1,200 కోట్లు ఆదా

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో భూసేకరణ, నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక విలువ కలిగిన ప్రైవేట్ భూముల సేకరణ అవసరం తగ్గడం ద్వారా సుమారు రూ.800 కోట్లు ఆదా కావచ్చని భావిస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన అండర్‌పాస్‌లు, గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణ ప్రణాళికతో పోలిస్తే వ్యయం మరో రూ.400 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. మొత్తంగా సుమారు రూ.1,200 కోట్లు ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>