కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ను వాడుకునేలా కల్వకుంట్ల కవిత (Kavitha) ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో ప్రకటించిన కొత్త పార్టీ (TRS Party) కి ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై అభ్యంతరాల స్వీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం నెల రోజుల గడువు ఇవ్వడంతో, వివిధ వర్గాల నుంచి ఏకంగా 700కు పైగా అబ్జెక్షన్స్ వచ్చినట్లు ఈసీ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఆమె ఇంతకాలం కొనసాగిన భారత రాష్ట్ర సమితి (BRS) ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ‘టీఆర్ఎస్’ (TRS)అనే పేరు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బీఆర్ఎస్ ను ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నందున, ఆ పేరును కవితకు కేటాయిస్తే తమకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని ఈసీకి సమర్పించిన లేఖలో బీఆర్ఎస్ పేర్కొంది.
మహారాష్ట్రకు చెందిన ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’, తెలంగాణకు చెందిన ‘తెలంగాణ రాజ్య సమితి’ పార్టీలు కూడా ‘టీఆర్ఎస్’ అబ్రివేషన్ పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. కవిత పార్టీ ప్రకటించడానికి ఒక రోజు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ ఈ పేరు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, భారీగా వస్తున్న అభ్యంతరాలపై వివరణ ఇచ్చేందుకు కవిత ప్రతినిధుల బృందం ఈసీని కలవడానికి సిద్ధమవుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తర్వాతే ఆమెకు ‘టీఆర్ఎస్’ (TRS Party) పేరు దక్కుతుందా లేదా అనేది తేలనుండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: బొద్దింకపై నిఘా.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై కేంద్రం స్పెషల్ ఫోకస్
Follow Us On: X(Twitter)

