కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పోరాటం చేస్తుంటే తనను అరెస్ట్ చేయడం అన్యాయమని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పందించారు. పోలీసులు బలప్రయోగంతో వ్యవహరించడం సరికాదన్నారు. నార్సింగి పరిధిలో మూసీ నదిని ఆక్రమించి మధ్యలో బిల్డింగులు కడుతున్నారంటూ జాగృతి ఆధ్వర్యంలో కవిత నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలీసులు బలప్రయోగంతో అరెస్ట్ చేయడం అన్యాయం. మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. ఈ అక్రమ నిర్మాణాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు. అదే వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేశారు.’ అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూల్యం చెల్లించుకోక తప్పదు
‘హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. హైడ్రా బుల్‌డోజర్లు ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని మేం భావిస్తాం. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్న అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నది. ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుంది.’ అంటూ కవిత (Kavitha) పేర్కొన్నారు.

