కలం, కరీంనగర్ బ్యూరో: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణలో ఉన్న 112 మంది గ్రూప్-1 సాధించి డీఎస్పీలుగా ఎంపికైన అధికారులకు పీఎమ్‌జే జ్యువెలరీ డెకాయిటి (దోపిడీ) కేసును ఒక కేస్ స్టడీగా వివరించారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు సుమారు మూడున్నర గంటల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణ సదస్సులో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం (CP Gaush Alam) ట్రైనీ అధికారులకు క్షేత్రస్థాయి అనుభవాలను, కేసు వివరాలను వివరిస్తూ అవగాహన కల్పించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో కేసు ఛేదనం
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తులో నిందితులు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరానికి పాల్పడినప్పటికీ, తెలంగాణ పోలీస్ శాఖ తమకున్న అత్యాధునిక సాంకేతిక పరికరాల (టూల్స్) ద్వారా డాటాను సేకరించి కేసును విజయవంతంగా ఛేదించిన తీరును ఈ సదస్సులో వివరించారు. ఈ కేసులో కరీంనగర్ కమిషనరేట్ సాధించిన విజయానికి పై అధికారుల సహకారం, సహోద్యోగుల సమష్టి కృషి (టీమ్ వర్క్) ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఆరు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాల గాలింపు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న వివిధ జిల్లాల ఎస్పీలు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సహోద్యుగులు ఈ కేసు దర్యాప్తు ఎంతగానో సహకరించారని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ముంబై, బెంగళూరు (కర్ణాటక) వంటి ఆరు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించాయి. అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఘనతను సాధించి, ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు మొత్తం 8 మంది నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.
క్షేత్రస్థాయి సవాళ్లు
ఈ సదస్సులో కరీంనగర్‌కి చెందిన ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని, నిందితులను పట్టుకోవడంలో తాము పోషించిన పాత్రను, ఎదుర్కొన్న క్షేత్రస్థాయి సవాళ్లను వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, ప్రాక్టికల్ విజ్ఞానం (ఫీల్డ్ నాలెడ్జ్), సమష్టి కృషి ఉంటేనే క్లిష్టమైన కేసులను ఛేదించగలమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.రానున్న కాలంలో ట్రైనీ అధికారులు క్షేత్రస్థాయిలో ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ కేస్ స్టడీ వారికి విధి నిర్వహణలో ప్రాక్టికల్ గైడ్‌గా ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ శిక్షణ అందించే కార్యక్రమానికి సి.పి గౌష్ ఆలంతో పాటు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, రూరల్ ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, తిరుమల్, ప్రకాష్, సరిలాల్ లతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

