మంజోత్ కల్రా అరెస్ట్‌పై నోరు విప్పిన లంక క్రికెట్ బోర్డ్!

కలం, స్పోర్ట్స్ : భారత మాజీ అండర్-19 వరల్డ్ కప్ స్టార్, జాఫ్నా కింగ్స్ సహ-యజమాని మంజోత్ కల్రా (Manjot Kalra) అరెస్ట్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డ్ (SLC) ఎట్టకేలకు నోరు విప్పింది. లీగ్‌లో అవినీతికి పాల్పడేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై జరిగిన ఈ సంచలన అరెస్టును తీవ్రంగా పరిగణించిన బోర్డు, క్రీడల్లో అవినీతిపై తమది ‘జీరో టాలరెన్స్’ పాలసీ అని ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIU)కు తాము పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.

ఈ సంచలన వివాదం ఎలా మొదలైందంటే.. 2018 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ హీరో అయిన మంజోత్ కల్రా, ఈ ఏడాది జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టి సహ-యజమానిగా మారారు. అయితే, ప్రస్తుత ఎల్‌పీఎల్ సీజన్‌లో ఆయన ఒక ప్లేయర్‌కు పెద్ద మొత్తంలో డబ్బు ఆశజూపి అవినీతికి పురిగొల్పే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. జాఫ్నా కింగ్స్ ఆటగాళ్లు భానుక రాజపక్ష, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లలాగే ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది.

రంగంలోకి దిగిన క్రీడల అవినీతి నిరోధక ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIU), లీగ్ ప్రారంభం రోజే కొలంబోలోని ఒక హోటల్‌లో మంజోత్ కల్రాతో పాటు యువరాజ్ పుష్ప అనే మరో భారతీయుడిని అరెస్ట్ చేసింది. కోర్టు వీరిద్దరికీ జులై 31 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ అరెస్టుల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. టోర్నమెంట్‌లో ఎలాంటి అవినీతి లేదా అవకతవకలను సహించేది లేదని తేల్చి చెప్పింది.

లీగ్ పారదర్శకత కోసం బోర్డు యాంటీ కరప్షన్ యూనిట్, ప్రభుత్వ సంస్థలతో కలిసి ముందే కఠినమైన నిబంధనలు అమలు చేసిందని పేర్కొంది. ఈ దర్యాప్తు ఎలా సాగుతున్నప్పటికీ, కొలంబోలో ప్రారంభమైన ఐదు జట్ల ఎల్‌పీఎల్ టోర్నీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. లీగ్ క్రెడిబిలిటీని కాపాడటానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>