కలం, వరంగల్: వరంగల్ భద్రకాళి దేవస్థానం (Warangal Bhadrakali)లో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా భద్రకాళీ సమేత భద్రేశ్వరస్వామికి ప్రతిరోజూ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, రుద్రహోమం నిర్వహించారు. సాయంత్రం కార్తీక దీపోత్సవం, శివసహస్రనామార్చనలు జరుగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నాలుగు సోమవారాల్లో లక్షపుష్పార్చన, లక్షబిల్వార్చన, యజ్ఞభస్మార్చన, అన్నాభిషేకం నిర్వహించనున్నారు. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం వైభవంగా జ్వాలాతోరణం కార్యక్రమం జరగనుంది.
ఒకే నగరంలో పంచశైవ క్షేత్రాలు..
వరంగల్ నగరానికి ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచిన ఐదు శైవక్షేత్రాలు ఇక్కడే కొలువై ఉన్నాయి. వరంగల్ కోటలోని స్వయంభూలింగేశ్వరస్వామి పృథ్వీలింగంగా, మట్టెవాడ భోగేశ్వరస్వామి జలలింగంగా, భద్రకాళి (Warangal Bhadrakali) ఆలయంలోని భద్రేశ్వరస్వామి అగ్ని లింగంగా, హనుమకొండ సిద్ధేశ్వరస్వామి వాయులింగంగా, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆకాశలింగంగా ప్రసిద్ధి చెందాయి. కార్తీక మాసంలో ఈ ఐదు క్షేత్రాలను దర్శించుకోవడం భక్తులు విశేషంగా భావిస్తారు.
Also Read : క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్.. తగ్గిన 137 ఔషధాల ధరలు
Follow Us On : WhatsApp

