కలం, కరీంనగర్: దసరా పండుగ వేళ కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాంపూర్ శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవస్థానం (Gidde Perumandla Temple) ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ప్రతి ఏటా అత్యంత వేడుకగా జరిగే దసరా ఉత్సవాలు, రామ్ లీలా కార్యక్రమాలకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఆలయం వద్ద క్యూలైన్లు, సౌకర్యాల పర్యవేక్షణ
దసరా పండుగ సందర్భంగా ఆలయానికి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం దేవదాయశాఖ తరఫున ఆలయ ఈవో మారుతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆలయం వద్ద ముమ్మర ఏర్పాట్లు చేయించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఆలయానికి పూర్తిగా రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లైటింగ్, తాగునీటి వసతి, క్యూలైన్ల నిర్వహణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆలయ పరిసరాలు స్వచ్ఛంగా ఉండేలా, భక్తులకు సులభంగా దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టారు.
నూతన ఉత్సవ కమిటీ – ప్రమాణ స్వీకారం
ఈ ఏటి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అధికార ప్రభుత్వం తరఫున 16 మందితో కూడిన దసరా ఉత్సవ కమిటీని నియమించారు. ఆలయ ఈవో మారుతి, ప్రధాన పూజారి రామక శంకర్ శర్మల సమక్షంలో కమిటీ బాధ్యతలు స్వీకరించింది. కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ సభ్యులు గా వంగ నాగరాజు, శ్రీమతి బండ లక్ష్మి, బత్తిని చిన్న రాజు, బుర్ర రాహుల్, గడప అజయ్, తుల ప్రవీణ్, బొంగోని వీరయ్య గౌడ్, శ్రీమతి లావుడియా లక్ష్మి, మహదేవుని మహేందర్, నేదునూరి మల్లయ్య, ఆది జలపతి, నంది ఈశ్వర్ రెడ్డి, శ్రీమతి దాంసాని విజయలక్ష్మి, శ్రీమతి బూర్ల అంజలి, మల్యాల వెంకన్న గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నూతన కమిటీ కృతజ్ఞతలు
కమిటీ ఏర్పాటైన అనంతరం నూతన ఉత్సవ కమిటీ సభ్యులు కరీంనగర్‌లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలు, పూలమాలలతో మంత్రిని ఘనంగా సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఒకే వేదికపై ప్రముఖులు – ఆధ్యాత్మిక పండుగ
ఈసారి ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరుకానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రామ్ లీలా మహోత్సవంతో పాటు స్వామివారి ప్రత్యేక పూజల్లో ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

