కలం, స్పోర్ట్స్ : అమెరికా మేజర్ లీగ్ క్రికెట్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. వెస్టిండీస్ దిగ్గజాలు డ్వేన్ బ్రావో (Dwayne Bravo), క్రిస్ గేల్ (Chris Gayle) కలయిక అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా ఉన్న బ్రావో.. గేల్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అనంతరం ఆయన పాదాలను తాకి గౌరవం తెలిపాడు. అలాగే గేల్‌ను “ఒరిజినల్ GOAT”గా పరిచయం చేశాడు. ఎంఎల్‌సీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అభిమానులు ప్రశంసించారు.
మరోవైపు ఫైనల్లో లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్ చరిత్ర సృష్టించింది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై ఒక్క పరుగు తేడాతో గెలిచి.. తొలి ఎంఎల్‌సీ టైటిల్‌ను అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ 19.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండ్రే ఫ్లెచర్ 47, కాలిన్ మున్రో 40, మాథ్యూ ట్రాంప్ 39 పరుగులు చేశారు. వాషింగ్టన్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర, నిఖిల్ చౌదరి, మిచెల్ ఓవెన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్.. 109/6తో కష్టాల్లో పడింది. సునీల్ నరైన్, జేసన్ హోల్డర్ చెరో మూడు వికెట్లు తీశారు. అయినా ఓబస్ పీనార్ 24 బంతుల్లో 53 పరుగులతో మ్యాచ్‌ను ఉత్కంఠకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతికే సిక్సర్ వచ్చింది. అయితే షాడ్లీ వాన్ షాల్క్విక్ రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి బంతికి రన్‌అవుట్ కావడంతో నైట్‌రైడర్స్ ఒక్క పరుగు తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.

