కలం, దమ్మపేట: పచ్చని తోటలు, గుబాళించే పండ్ల మొక్కలు, వేలాది కుటుంబాల్లో ఉపాధి. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట (Aswaraopeta-Dammapeta) ప్రాంతాల్లో నేడు ఎటు చూసినా ఈ దృశ్యాలే ఆవిష్కృతమవుతున్నాయి. ఒకప్పుడు కేవలం సంప్రదాయ వ్యవసాయానికే పరిమితమైన ఈ నేల, కాలక్రమేణా తెలంగాణకే ‘గ్రీన్ క్యాపిటల్’గా మారింది. ఏపీలోని ప్రముఖ నర్సరీల తరహాలోనే, అశ్వారావుపేట, దమ్మపేట పరిసర ప్రాంతాలు కూడా ఉద్యానవన రంగంలో తనదైన ముద్ర వేస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి.
300కుపైగా మామిడి నర్సరీలు
ఇక్కడి ఎర్రమట్టి నేలల సారవంతం, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, సమృద్ధిగా లభించే నీటి వనరులు ఉద్యాన మొక్కల పెంపకానికి స్వర్గధామంగా మారాయి. దమ్మపేట, అశ్వారావుపేట సరిహద్దుల్లో ప్రస్తుతం 300కుపైగా మామిడి నర్సరీలు, 20కి పైగా జామ నర్సరీలు విస్తరించి ఉన్నాయి. నాణ్యతకు పెద్దపీట వేస్తుండటంతో ఇక్కడ పెరిగే బంగినపల్లి, ఆల్ఫన్సో, కేసరి, హిమాయత్, పునాస, దసేరి, మల్లిక, తోతాపురి, చిన్నరసాలు వంటి మామిడి రకాలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.
ఒక్కో మామిడి మొక్క రకం, వయస్సును బట్టి రూ.120 నుంచి రూ.300 వరకు ధర పలుకుతుండగా, ఒక్క సీజన్‌లోనే రెండు నుంచి మూడు లక్షలకు పైగా మామిడి మొక్కలు తరలిపోతున్నాయి. అలాగే ఏటా సుమారు 20 లక్షల జామ మొక్కలు దేశంలోని వివిధ మూలలకు సరఫరా అవుతున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది.
వేలాది కుటుంబాలకు ఉపాధి
ఈ నర్సరీల విస్తరణ కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా, వేలాది కుటుంబాలకు నిరంతర జీవనాధారంగా మారింది. అంటుకట్టడం, మొక్కల పెంపకం, నీటి నిర్వహణ, ప్యాకింగ్, లోడింగ్ వంటి పనుల్లో వందలాది మంది కూలీలకు నిత్యం ఉపాధి దొరుకుతోంది. వీటి అనుబంధ రంగాలుగా మట్టి రవాణా చేసే ట్రాక్టర్లు, కూలీలను చేరవేసే ఆటోలు, మొక్కలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే లారీల డ్రైవర్లు, యజమానులతో పాటు చిన్న తరహా వ్యాపారులకు ఈ నర్సరీల వ్యవస్థే ఆకలి తీర్చే ఆసరాగా నిలిచింది. ఇక్కడి మొక్కలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ లాంటి రాష్ట్రాల రైతులు కూడా జై కొడుతుండటంతో దమ్మపేట బ్రాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
అయితే, ఇంతటి ప్రతిభ కలిగిన ఈ ప్రాంతం రాష్ట్రంలోనే శక్తివంతమైన ‘హార్టికల్చర్ హబ్’గా ఎదగాలంటే ప్రభుత్వ మద్దతు అత్యవసరమని స్థానిక రైతులు స్పష్టం చేస్తున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నర్సరీలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న రీతిలోనే, తెలంగాణలోనూ ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని ఇక్కడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ ఖర్చులు తగ్గడంతోపాటు మెరుగైన రహదారులు, రవాణా వసతులు, సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పిస్తే, అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలో అగ్రగామి హార్టికల్చర్ హబ్‌గా నిలవడం ఖాయం.
ఉచిత విద్యుత్ అందించాలి: వై. రాఘవేంద్రరావు, దమ్మపేట
నేను దమ్మపేట మండలం, మందలపల్లిలోని లక్ష్మీ వేంకటేశ్వర నర్సరీలో మామిడి మొక్కలు పెంచుతున్నా. ఇక్కడి వాతావరణం, మట్టి నర్సరీలకు అనుకూలంగా ఉండటం వల్ల నేను సొంతంగా ఉపాధి పొందుతున్నా. రోజూ 40 నుండి 50 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నా. ఇక్కడ పెంచే రకరకాల మామిడి మొక్కలను తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నర్సరీలకు ఉచిత విద్యుత్ అందిస్తే ప్రోత్సాహకంగా ఉంటుంది.

