కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ (Karimnagar Task Force) కమీషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం కొత్తపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించింది. ఈ దాడిలో జూదగాళ్ల ఆట కట్టించి, నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కొత్తపల్లి గ్రామంలోని సదరు స్థావరంపై దాడి చేశారు.
డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అక్కడికక్కడే పట్టుకొని బంధించారు. జూదరుల నుండి రూ.18,940 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న 4 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. అరెస్టయిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం జరిగింది. నగర పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

