కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) కేంద్రంగా డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నెల 3న నగలషాపులో జరిగిన దోపిడీ ఘటన ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారింది. విమర్శలు ప్రతి విమర్శలతో కరీంనగర్ పట్టణం దద్దరిల్లుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలపై బీజేపీ కార్యకర్తలు, కార్పోరేటర్లు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపులో కారును ద్వంసం చేయడం, కార్యకర్తలపై దాడి చేయడం విమర్శలకు దారి తీసింది.
కొనసాగుతున్న దర్యాప్తు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 3న నగల షాపులో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. తాజాగా కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా కలమడుగులో నిందితులు వాడినట్లు భావిస్తున్న మరో బైక్ (అపాచీ) ను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఆ బైక్‌పై వెళ్లిన ఇద్దరు నిందితులు ఇప్పటికే సరిహద్దులు దాటి మహారాష్ట్రకు చేరుకున్నట్లు పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ద్వారా ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారి పేర్లు ఆనంద్, ఇంతియాజ్, షాబుద్దీన్ అని గుర్తించినట్లు తెలిసింది. పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
నిందితుల కోసం గాలింపు
నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిందితులు పక్కాగా రెక్రీ నిర్వహించారు. ధర్మపురి కేంద్రంగా లాడ్జీలో 6 గురు దుండగులు బస చేసినట్లు పోలీసులు నిర్దారించారు. అయితే అందులో నలుగురు దుండగులు మాత్రమే దోపిడీకి పాల్పడ్డారు. మిగితా నిందితులు వారికి సహాయ పడ్డారని తెలుస్తోంది. అందులో ఒక్కరు మాత్రమే తెలుగు మాట్లాడడం వెనుక ఇక్కడి వారి హస్తం ఉందని స్పష్టమవుతోంది. సిసి కెమెరాలు కానరాకుండా మట్టి రోడ్ల మీదుగా వెళ్లిన దుండగులు పకడ్డందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నిందితులు గోదావరి గుండా నడుచుకుంటూ మహారాష్ట్ర కు వెళ్లినట్లు తెలుస్తొంది. అయితే వీరు బీహార్ కు చెందినవారా? మహరాష్ట్రకు చెందినవారా? అని స్పష్టత లేదు. గుర్తించిన దుండగులు దేశవ్యాప్తంగా ఇలాంటి దొంగతనాలు చేసి రికవరీ చేయలేని పరిస్థితిలు కల్పిస్తారని తెలిసింది.
పోలీసులపై విమర్శలు
నాలుగు రోజులు గడిచినా దొంగతనం చేసిన వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ బైక్ పోటోలు.. చలాన్లు తప్ప దొంగలను పట్టుకోరా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ స్మార్ట్ సిటీలో దాదాపు వెయ్యికి పైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూంకు అనుసంధానం చేసిన పోలీసులు ఆదిశగా పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. దుండగులు చింతకుంట, మల్కాపూర్ మీదుగా వెళ్లినా ఆలోపు వారిని ఆయా స్టేషన్ల పరిధిలో పట్టుకోలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.
రాజకీయ అస్త్రంగా …
కరీంనగర్ లో జరిగిన దోపిడీ ఘటన అన్ని పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారింది. కేంద్ర మంత్రి మండి సంజయ్కు కూత వేటు దూరంలోనే ఉండడంతో ఆయన హుటాహుటిన సందర్శించారు. బాధితులను పరామర్శించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా పోలీసులు శాంతిభద్రతల నేపధ్యంలో తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. తదనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వచ్చి బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి దొంగతనానికి లింకు ఉన్నట్లుగా మాట్లాడడం.. బండి సంజయ్ ను విమర్శించడం రాజకీయంగా దుమారం రేగింది. తదుపరి మంత్రులు, కాంగ్రెస్ నేతలు మీడియా ముందు దుయ్యబట్టిన సంఘటనలు ఎదురయ్యారు. పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు.
200 మందితో కూంబింగ్
ఓ దొంగతనం వెనుక ఇన్ని పార్టీలు మూకుమ్మడిగా దాడి చేయడం సైతం ప్రజలకు అంతుపట్టడం లేదు. ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ అంటూనే చెబుతున్నారు. 12 బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు 200 మంది పోలీసు బలగాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. గాలింపు చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో పోలీసులకు రెండు బైక్ లు లభించాయి .
కీలక ఆధారాలు లభ్యం
ఈ కేసుకు సంబంధించి తాజాగా కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా కలమడుగు గ్రామంలో నిందితులు వాడినట్లు భావిస్తున్న మరో బైక్ (అపాచీ) ను పోలీసులు గుర్తించినట్లు , ఆ బైక్‌పై వెళ్లిన ఇద్దరు నిందితులు ఇప్పటికే సరిహద్దులు దాటి మహారాష్ట్రకు చేరుకున్నట్లు పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు.సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాల ద్వారా ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారి పేర్లు ఆనంద్, ఇంతియాజ్, షాబుద్దీన్ అని సమాచారం. ప్రస్తుతం ఈ వివరాలపై పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిందితులు ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలకు తరలివెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులు బలగాలు సైతం ఆ రెండు రాష్ట్రాలలో జల్లెడ పడుతూ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

