కలం, కరీంనగర్: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన జాతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ తన బాధ్యతలను విస్మరించి, అక్రమంగా ఓటు హక్కును తొలగిస్తున్నారని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో AISF, AIYF ఆధ్వర్యంలో నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన (Karimnagar Protest) కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్, AIYF జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి పౌరుడి జన్మహక్కు అని పేర్కొన్నారు. అలాంటి ఓటు హక్కును కాలరాస్తూ SIR పేరుతో లక్షలాది మంది పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, విద్యార్థులు, యువజనుల ఓట్లను తొలగించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జాతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, అక్రమంగా తొలగించిన ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అక్రమ ఓట్ల తొలగింపును నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా AISF, AIYF ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా అధ్యక్షుడు నునావత్ శ్రీనివాస్ నాయక్, AIYF జిల్లా నాయకులు చంచల మురళి, AISF నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, జిల్లా ఉపాధ్యక్షుడు కసిరెడ్డి సందీప్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి జవ్వాజి తిరుపతి, MDYF నాయకుడు ఎండి ఫిరోజ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

