కలం, కరీంనగర్: దశాబ్ధాలుగా పేరుకు పోయిన కరీంనగర్ డంపింగ్ యార్డు (Karimnagar Dumping Yard) చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా శనివారం పలువురు కార్పోరేటర్లు, అధికార సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డును సందర్శించి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తనిఖీ చేసి పరిశీలించారు. డంపింగ్ యార్డులో చెలరేగుతున్న మంటలను, పొగను అదుపు చేసేందుకు స్థానికంగా ఉండి అధికారులు సిబ్బందితో తక్షణ చర్యలు చేపట్టారు. మున్సిపల్ వాటర్ ట్యాంకర్లకు మోటార్ ప్రెషర్ పంపులను అమర్చి.. చెలరేగుతున్న మంటలను అదుపు చేయించారు. పూర్తి స్థాయిలో మంటలు, పొగలు ఆర్పేందుకు సిబ్బందిని బృందాలుగా నియమించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. గత 40 నుంచి 50 ఏళ్లుగా డంపింగ్ యార్డులో 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందన్నారు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పొగ, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డంపు యార్డు సమస్యకు ముగింపు పలకడమే తమ పాలకవర్గం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ.17 కోట్లతో బయోమైనింగ్ పనులు చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. త్వరలోనే బయోమైనింగ్ ప్రక్రియ కు సంబంధించి 4 యంత్రాలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభం చేస్తామని స్పష్టం చేశారు. 6 నుండి 7 నెలల వ్యవధిలోనే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా వచ్చే చెత్త ద్వారా గతంలోనే స్మార్ట్ సిటీలో ప్రారంభం చేసిన బయోమైనింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని తెలిపారు. కరీంనగర్‌ను అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీమ్‌లో చేర్చి రూ.840 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెత్తను ప్రక్షాళన చేయడంతో పాటు కొత్తగా రోజు వచ్చే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేపట్టేలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా ఏడాదిన్నర కాల వ్యవధిలో డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చేసేలా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిధులు సమకూర్చి, ఏడాది వ్యవధిలో డంపింగ్ యార్డ్ సమస్యకు ముగింపు పలుకుతామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు మెరుగు పర్చడానికి తమ పాలకవర్గం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు మాసం గణేష్, పీపీఏ చంద్ర, తోట అనిల్, మేకల వెంకటేష్, వసంత లక్ష్మీ భూమయ్య, నాయకులు బండారి గాయత్రి, వెంకట్ రెడ్డి, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

