కలం, కరీంనగర్ బ్యూరో : ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌లో (Online Gambling) భారీగా డబ్బులు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ యువకుడు డబ్బు కోసం మహిళను కిడ్నాప్ చేసి, బంగారు ఆభరణాలు దోచుకుని, అనంతరం హత్యాయత్నానికి పాల్పడిన సంచలన ఘటనను కరీంనగర్ (Karimnagar) పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు ధమ్మ దినేష్ రెడ్డి (21)ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నెల 1న కరీంనగర్ టవర్ సర్కిల్ సమీపంలోని లేబర్ అడ్డా వద్ద కూలీ పనికి ఎదురుచూస్తున్న గంగాధర లక్ష్మి (55) అదృశ్యమవడంతో తొలుత కరీంనగర్-3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో మహిళను కిడ్నాప్ చేసి దోపిడీ చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు తేలడంతో కేసును కరీంనగర్-1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి విచారణ చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో గొల్లపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ధమ్మ దినేష్ రెడ్డి ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. నిందితుడు DIUWIN, జియో లాటరీ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ గేమ్స్‌కు బానిసై సుమారు రూ.4 లక్షలు నష్టపోయాడు. లోన్ యాప్‌ల ద్వారా తీసుకున్న అప్పుల ఒత్తిడితో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించిన నిందితుడు, బాధితురాలిని ర్యాపిడో బైక్‌లో తిమ్మాపూర్ సమీపంలోని నుస్తులాపూర్ శివారుకు తీసుకెళ్లి ఆమెపై దాడి చేశాడు. ఆమె వద్ద ఉన్న సుమారు 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి మట్టెలు దోచుకున్నాడు. అనంతరం తన నేరం బయటపడకుండా ఉండేందుకు బాధితురాలిని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఆమె తాడును పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించగా, దానిని కూడా కత్తిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే బాధితురాలికి ఈత రావడంతో బావిలోని మరో తాడును పట్టుకుని రాత్రంతా ప్రాణభయంతో గడిపింది. మరుసటి రోజు ఉదయం పొలానికి వచ్చిన రైతులు ఆమె కేకలు విని తాళ్లు, మంచం సహాయంతో బయటకు తీసి రక్షించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, సెల్‌ఫోన్ విశ్లేషణ ఆధారంగా నిందితుడిని మార్కెట్ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్‌లు , నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, రూ.5 వేల నగదు, వెండి మట్టెలు స్వాధీనం చేసుకున్నారు.దోచుకున్న బంగారు ఆభరణాలను ఓ నగల వ్యాపారికి విక్రయించినట్లు విచారణలో తేలగా, వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, అక్రమ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, అవి వ్యక్తులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసి చివరకు తీవ్రమైన నేరాలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

