కలం, కరీంనగర్ బ్యూరో : విలీన గ్రామాల డివిజన్‌ల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నగరపాలక సంస్థ పాలకవర్గం పని చేస్తోందని కరీంనగర్ (Karimnagar) నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. సోమవారం 23వ డివిజన్‌లో మేయర్ పర్యటించి, సీతారాంపూర్ ప్రాంతంలోని పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. నగరపాలక సంస్థకు చెందిన 49.90 లక్షల సాధారణ నిధులతో 300 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ గుమ్మడి రాజ్ కుమార్‌తో కలిసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ (Kolagani Srinivas) మాట్లాడుతూ, ప్రతి డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా విలీన గ్రామాల డివిజన్‌లలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల నగరపాలక సంస్థలో కలిసిన గ్రామాలకూ నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు, కార్పొరేటర్‌లు సూచించే ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. పనులలో నాణ్యత తగ్గకుండా ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరగాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
అలాగే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో అమృత్ 2.0 పథకం కింద 147 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో విలీన గ్రామాలలో తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభించామని, అయితే కొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పనులను వేగవంతం చేసి తాగునీటి సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ, భారీ అపర్ణ జితేందర్, ఇంజనీరింగ్ అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

