కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీకి ఈ వ్యాఖ్యలు కొంత డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందిస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఓ ప్రకటన కూడా చేయలేదు. ఇటీవల జగిత్యాల సభలోనూ ఈ విషయం ప్రస్తావించలేదు. సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో తేజస్వి వ్యాఖ్యలను కేసీఆర్ లేవనెత్తడం గమనార్హం. తేజస్వి విభజన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే.. తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు మౌనంగా ఉండిపోయారని మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీలను టార్గెట్ చేస్తూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారని.. పార్లమెంటులో, బయటా స్పందించారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ పార్టీ నేతలతో నిర్వహించిన కార్యవర్గసమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ముందుగా పార్టీ నేతలకు ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిని పరిచయం చేశారు.
ధాన్యం కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం
తాము 2009లో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో కేసీఆర్ వివరించారు. చంద్రబాబు నాయుడు తో జై తెలంగాణ అని చెప్పించేందుకే తాము టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇది చిల్లర ప్రభుత్వం ఆ మాటలు ఏమిటి? ఆ కూతలు ఏమిటి అంటూ కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని కేసీఆర్ సూచించారు.

