కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వరి కోత పనుల కోసం పొలానికి వెళ్లిన రామంచ బాల్ రెడ్డి(57) పాముకాటు(Snake Bite)తో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బుధవారం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన బాల్ రెడ్డి పొలం గట్టుపై నడుస్తుండగా పొదల్లో ఉన్న విషసర్పం ఒక్కసారిగా కాటు వేసింది.
అక్కడే ఉన్న ఆయన తమ్ముడు వెంటనే స్పందించి బాల్ రెడ్డిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ విషం శరీరమంతా వ్యాపించడంతో పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పంట చేతికొచ్చే సమయంలో కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

