జాతీయ పాల దినోత్సవం.. కురియన్‌కు ఘన నివాళి

కలం, కరీంనగర్ బ్యూరో: శ్వేత విప్లవ పితామహుడు స్వర్గీయ డాక్టర్ వర్గీస్ కురియన్ 105వ జయంతిని పురస్కరించుకుని, జాతీయ పాల దినోత్సవ (National Milk Day) వేడుకలను కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (Karimnagar Dairy) ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కురియన్ ఆశయాలకు అనుగుణంగా డెయిరీని మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో రోజుకు 5 లక్షల లీటర్ల పాల సేకరణ, విక్రయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సంస్థ ప్రకటించింది.

కరీంనగర్ డెయిరీ, ఐడీఏ (IDA) తెలంగాణ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శాతవాహన యూనివర్సిటీ, గీతాభవన్ చౌరస్తా, ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ వద్ద వాకర్స్, పట్టణ ప్రజలకు 5 వేల ప్యాకెట్ల వేడి పాలు, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం డెయిరీ ఆవరణలోని డాక్టర్ వర్గీస్ కురియన్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కరీంనగర్ డెయిరీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. కురియన్ స్ఫూర్తితో కరీంనగర్ డెయిరీని తెలంగాణలోనే నంబర్ వన్ స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా 2014 నవంబర్ 30న కరీంనగర్ డెయిరీలో కురియన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఆయన సూచనలు, సలహాలతో సంస్థను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం రోజుకు 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ, అంతే మొత్తంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పాల సేకరణను 5 లక్షల లీటర్లకు పెంచడంతో పాటు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించి విక్రయాలను కూడా అదే స్థాయికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. డాక్టర్ కురియన్ జీవిత విశేషాలు, అమూల్ బ్రాండ్ ఏర్పాటు, ‘పాల వెల్లువ’ పథకం ద్వారా ఆయన సాధించిన విజయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి. శంకర్ రెడ్డి, డెయిరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>