కలం, నాగార్జునసాగర్: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్-హాలియా (Nagarjuna Sagar) ప్రధాన రహదారిపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన బ్రీజా కారు ఒక ఆటోను బలంగా ఢీకొట్టడంతో, ఆటోలో ప్రయాణిస్తున్న చేపల వ్యాపారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారమ్ (శేషమ్మ గూడెం) ఎస్టీ కాలనీకి చెందిన రుద్రాక్ష కుమార్ (37) ప్రతిరోజూ నాగార్జునసాగర్ నుంచి చేపలను కొనుగోలు చేసి, ఆటోలో నల్లగొండ పానగల్ వద్దకు తీసుకువచ్చి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఎప్పటిలాగే మంగళవారం సాగర్ నుంచి ఆటోలో నల్లగొండకు వస్తుండగా, మార్గమధ్యంలో ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన బ్రీజా కారు నియంత్రణ కోల్పోయి ఆటోను బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన వేగానికి కారు ఆటోపైకి దూసుకెళ్లడంతో, లోపల ఉన్న రుద్రాక్ష కుమార్ కారు కింద పడి నలిగిపోయి తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మృతుడు రుద్రాక్ష కుమార్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నిత్యం కష్టపడుతూ కుటుంబాన్ని పోషించే యజమాని అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవపరీక్ష నిమిత్తం నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారు డ్రైవర్ అతివేగమే కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద తీవ్రతకు వాహనాలు రెండూ నుజ్జునుజ్జయ్యాయి.

